కొత్త సంవత్సరం లో ఏపీలో కొత్త పథకం


Dec 23 2017 7:15 AM

politics,ycp,ysrcp,tdp,chandrababu,andhra pradesh


కొత్త సంవత్సరం లో ఏపీలో కొత్త పథకం: ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం కొత్త ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. రాష్ట్రానికి నిధుల కొరత ఇబ్బందికరంగా తయారైన కానీ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం చంద్రబాబు వెనక్కి తగ్గడం లేదు. మరి పది రోజుల్లో రానున్న కొత్త ఏడాదిలో బడుగు బలహీన వర్గాల కోసం మరో పధకం ప్రవేశ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ విషయాలను పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.

నూతన సంవత్సర కానుకగా వెనుకబడిన వారికి చంద్రబాబు ప్రభుత్వం పెళ్లికానుక అందించాలని నిర్ణయించిందని మంత్రి వివరించారు. కొత్తగా పెళ్లి చేసుకోబోయే వధూవరులు రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తులు అందిస్తే పెళ్లిరోజు నాటికి రూ.30 వేలు ఇవ్వనున్నట్లు వివరించారు. వెనుకబడిన వర్గాల్లోని పేదలకు ఈ పధకం మరో వరం కానుంది. ఇప్పటికే క్రిస్మస్, సంక్రాంతి కానుక పేరిట అందరి ఇళ్లలో పండగ వెలుగు నిండేలా సీఎం కృషి చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు.

ఇక రాష్ట్రంలో తాగు నీటి సమస్య పరిష్కారానికి రూ.10 వేల కోట్లతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో తాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు మంత్రి లోకేష్‌ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. మరో మంత్రి సిద్దా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పక్క రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచాయన్నారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థవంతమైన నాయకత్వంతోనే సాధ్యమయిందని చెప్పారు.

భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉన్నదని ప్రజలు గుర్తించారన్నారు. ఇక వైఎస్‌ జగన్‌ పాదయాత్ర విషయానికి వస్తే పాదయాత్రకు ప్రజల మద్దతు లేదని, ఎన్ని హామీలు ఇచ్చినా జగన్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ఆయన రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండి పడ్డారు.